thumbnail

తలారిచెరువు గ్రామస్తుల వింతఆచారం

తలారిచెరువు గ్రామస్తులు వింత ఆచారం

అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం లోని తలారిచెరువు గ్రామస్తులు పూర్వీకుల నుండి ఒక వింత ఆచారాన్ని పాటిస్తారు.ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి ముందు రోజు అర్ధరాత్రి నుండి విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా, పశు పక్షాదులను వదలి ఇండ్లకు తాళాలువేసి అందరూ గ్రామం నుండి ఖాళీ చేసి, గ్రామానికి సమీపంలోని దర్గా వద్దకు చేరుకుంటారు.ఇలా చేరుకోవటాన్ని వారు ‘అగ్గిపాడు’ గా పేర్కొంటారు. అక్కడే వంటచేసుకుంటారు. తిరిగి అదే రోజు రాత్రి అందరూ 7 గం.లకు గ్రామానికి బయలుదేరి, దీపంకూడా వెలిగించకుండా ఆరుబయటే భోజనాలు చేసి, రాత్రి తిరిగి 12.గం.లకు విద్యుత్ సరఫరా వచ్చినాక, గుమ్మానికి కొబ్బరికాయ కొట్టి ఇండ్లలోకి ప్రవేశిస్తారు.కొన్ని వందల సంవత్సరాల నుండి వస్తున్న ఈ వింత ఆచారం వెనుక నిగూడ రహస్యం దాగి ఉందని తెలుస్తుంది. ఐదారు వందల సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి ఒక బ్రాహ్మణుడు తన మందితో చొరబడి, పండిన పంటలు దోచుకుపోతుంటే, గ్రామస్థులు అందరూ ఏకమై అతనిని మాటువేసి హతమార్చినట్లు, అప్పటి నుండి గ్రామాభివృద్ధి క్షీణించిందని, పశుపక్షాదులకు, మగశిశువులకు అకాల మరణాలు సంభవిస్తున్నాయని అనే నమ్మకంతో, బ్రాహ్మణ హత్య మహాపాతకం అని భావించి, గ్రామ పెద్దలు కొంత మందిని సంప్రదించగా, అందుకు వారు పరిహారంగా ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమి రోజు గ్రామం వదలి బయట గడపాలని సూచించగా, అప్పటినుండి ఈ ఆచారం పాటిస్తే గ్రామానికి పట్టిన కీడు వైదొలగి గ్రామం సుభిక్షంగా ఉంటుందని అనే నమ్మకంతో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగించటం విశేషం.

మూలం:ఈనాడు నెట్ 2019 అక్టోబరు 8 తెలుగు వికీపీడియా నుండి సేకరణ

thumbnail

టీ బండే రేయంబవుళ్లు వృద్దదంపతుల నివాసం


వృద్ద దంపతులు జీవన ప్రయాణం

పై ఫొటోలోని వృద్ద దంపతులు  వెంకటేశ్వర్లు (70 సం.) , నాగేంద్రమ్మ (60 సం.). వీరిది పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట. వెంకటేశ్వర్లు భార్య సామ్రాజ్యం పుట్టిల్లు నరసరావుపేట మండలంలోని దేచవరం.వీరికి ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. వీరికి నరసరావుపేట రైల్వేస్ఠేషను సమీపంలో ఉన్న కొద్దిపాటి ఇంటిని 20 సంవత్సరాల కిందట ఒక లక్ష రుపాయలకు అమ్మి, దానిని తాకట్లు పెట్టి  తీసుకున్న 30000, దానికి వడ్డీ కింద 20000  మొత్తం 50000 పోను మిగిలిన 50000 సొమ్మతో ఆడపిల్లల పెండ్లిల్లు చేసారు.పెద్ద కొడుకు గుండె జబ్బుతో పెండ్లి  తరువాత కొంత కాలానికి చనిపోయాడు.చిన్న కొడుకు గుంటూరులో అతి కష్టంగా తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఇక పోతే వీరిద్దరూ సుమారు ఆరు, ఏడు  సంవత్సరాల నుండి రైల్వే స్ఠేషను ప్రధాన గేటు ఎదురుగా ఉన్న మునిసిపాలిటీ ఓవర్ హెడ్ ట్యాంకు గేటు పక్క, వాహనాలు వచ్చేపోయే రోడ్డులో  టీ బండిలాంటిది నడుపుకుంటూ రాత్రిబవళ్లు నివాసం అక్కడే సాగిస్తున్నారు.వెంకటేశ్వర్లు రాత్రి టీ బండిమీద చింపిరి గుడ్డలతో (దాదాపుగా ఎప్పుడూ అలానే ఉంటాడు)  పడుకుంటే, సామ్రాజ్యమ్మ దాని పక్కనే చిన్న మంచం వేసుకుని తెల్లవార్లు విసురుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అక్కడ టీ కూడా ఎక్కువ మంది తాగని పరిస్థితి ఉంది, వెంకటేశ్వర్లుకు ప్రభుత్వం ఇచ్చే వద్దాప్య పించను అందుతుంది.అయితే వారిద్దరిలో ఎటువంటి బాధను కనపర్చకపోవటం చాలా విశేషం.ఈ పరిస్థితులలో వారిని సంతానం పట్టించుకోవటంలేదని  ఎలా అనగలం. ఇలాంటి నిర్బాగ్యులు ఇంకా ఎంతమంది ఉన్నారో? అది ఒక అంతులేని ప్రశ్న.

thumbnail

పదవ తరగతిలో ప్రధమ స్థానం సాధించిన మానస



బత్తల మానస 

మన మన పొనుగుపాడు జెడ్.పి.హెచ్. పాఠశాల 2018-19 విద్యా సంవత్సరం  పదవ తరగతి  పరీక్షా ఫలితాలనందు 9.8 గ్రేడుతో బత్తల మానస  స్కూలు ప్రథమ స్థానం సాధించింది. సంకల్పబలం ఉంటే దూర తీరాలపై ఆశ పడాల్సిన అవసరం లేదని నిరూపించిది.ప్రభుత్వ పాఠశాలలను చిన్న చూపు చూసేవారికి  కనువింపు కలుగ చేసింది. పాఠశాల తరుపున 39 మంది విద్యార్థులు హాజరుకాగా 37 మంది (94.87 %) విద్యార్థులు ఉత్తీర్ణలు అయ్యారు. బత్తుల మానస ప్రధమ స్థానం సాదించగా, బండారు నమో వెంకట్ (9.7) ద్వితీయ స్థానం సాధించగా, గద్దె మౌనిక (9.3) తృతీయ స్థానం సాధించింది. వీరందరికి శుభాకాంక్షలు

thumbnail

ఆనందం వెల్లివిరిసినవేళ ఘనంగా జరిగిన ఆత్మీయ కలయక

పొనుగుపాడు ఉన్నత పాఠశాల 2004-05సం.టెన్త్ క్లాస్ జట్టు ఆత్మీయ కలయిక


ఈ జట్టు విద్యార్థులు పొనుగుపాడు ఉన్నత పాఠశాలలో 2000-2001 సం. నందు 6 తరగతిలో చేరారు. 2004-05 సం. 10 తరగతి  పబ్లిక్ ఎక్జామ్స్ రాసారు. జీవిత ప్రయాణంలో 13 సంవత్సరాలు ప్రయాణించి వారందరు జీవితంలో అజ్ఞానం అనే చీకటిని పొగొట్టి, వెలుగు చూపిన పాఠశాల అనే దేవాలయంలోని దేవుళ్లు అనే గురువులను కలవాలని అనుకున్నారు. 13.01.2019 (ఆదివారం)న కలసి పాదాబి వందనం చేసుకున్నారు. ఈ సందర్బంగా జరిగిన ఆత్మీయ సమావేశానికి పాఠశాల ప్రదనోపాధ్యాయిని పద్మావతి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. గతంలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసిన ప్రభుదాసు,  విద్యాబోధన చేసిన గురువులు సాంబశివరావు, కృష్ణయ్య, హనుమయ్య, జాన్సీ, సుబ్బారావు, ఖాశిం, ఇంకా తదితరులను సన్మానించారు.

ఈ సందర్బంగా ఇంకా ఓనామాలు నేర్పిన వలి మాష్టరు, 10 తరగతిలో ట్యూషన్ చెప్పిన నరసింహారావు మాష్టరు గార్లను కూడా పురస్కరించారు.సమావేశంలో ఈ సందర్బంగా పలువురు పూర్వ విద్యార్ధులు పాఠశాల అభివృద్దికి తోడ్పడగలమని చెప్పారు.


సమావేశం తదుపరి వారి చిన్ననాటి స్నేహితులతో మరపుగాని సంఘటనలు, ముచ్చట్లు గుర్తుకు తెచ్చుకుని మురిసిపోయారు.ఈ ఆత్మీయ సమావేశంలో ఈదర ఆనందబాబు, నిడమానూరి నరేష్,ప్రత్తిపాటి అనిల్ కుమార్, గద్దె ప్రసన్న,యర్రం వెంకటేశ్వరరావు, గుర్రం అనూష,  సుంకుల కోటినాగలక్ష్మి, కర్లపూడి సురేంద్ర, అర్వపల్లి విజయ కుమార్, ఒంటిపులి శ్రీనివాసరావు, జమ్ముల శ్రీనివాసరావు, గార భరత్, క్రోసూరి సాయిలక్ష్మి, బొట్ల వెంకట నరసమ్మ, భాను, శ్రీలక్ష్మి, తన్నీరు సుమలత, సుజాత, చావా అనూష, చావా నాగేశ్వరరావు, బెజ్జం వందన,  నిజాంముద్దీన్, మస్తాన్ వలి, గాజుల శ్రీలత, రవికిరణ్, కోటి, పసల రాజారావు, రాజేశ్, చంటి, రామారావు, మేళం ప్రతాప్, మేళం సాంబశివరావు, దారా మోహన్ బాబు,తన్నీరు కోటేశ్వరరావు,గేరా అనిల్ కుమార్, అంజి, ప్రసాద్, విజయ్, గేరపాటి శ్రీను,తాతపూడి వీరాంజనేయులు ఇంకా తదితర విద్యార్దులు పాల్గొన్నారు.ఈ సమావేశం జరగటానికి తగిన కృషి చేసిన ఈదర ఆనందబాబు, నిడమానూరి నరేష్, ప్రత్తిపాటి అనిల్ కుమార్, యర్రం వెంకటేశ్వరరావులను పలువురు అభినందించారు.కార్యక్రమానికి పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంటు కోయ రామారావు, వలి మాష్టరు తగిన తోడ్పాటు, సహకారం అందించారు.

thumbnail

యువతా చెప్పానని కినుక వహించుకమా!

యువతా చెప్పానని కినుక వహించుకమా!

  • ఓ యువతా నీ ఓటు హక్కు దుర్వినియోగం చేయకుమా,
  • అవినీతి తెగులు, నేర చరిత్ర, లేని మంచి అభ్యర్థికి వేయాలి నీ ఓటు
  • అంతేగాదు అక్రమ మార్గాలలో సంపాదించిన నేరగాళ్లకు,
  • పీకల్లోతు కుంబకోణాలలో కూరుకుపోయిన వ్యక్తులకు
  • నీ ఓటు వేసి తదుపరి తప్పు చేసానని ప్రాశ్చాత్య పడకుమా!
  • మంచికి మారుపేరు గల వార్కి వేయాలి సుమా నీ ఓటు
  • ఈ దేశానికి పట్టిన అవినీతి రుగ్మతలు నుండి ఒడ్డున
  • పడగలవేయ సత్తా మీ యువతకు ఉందని మేమంతా
  • ఎదురు చూచుటను వమ్ము చేయకురా!
  • ఇంతేకాదు సుమా అంతకన్నా ముందు మీరు
  • ఆరోగ్యంగా ఉంటేనే జాతి, దేశం బలంగా ఉండేది,
  • చెప్పానని కినుక వహించుక కొద్దిగా ఆలోచించు సుమా,
  • మధ్యపానం,దూమపానం వధ్దురా! మాదకద్రవ్యాల జోలి
  • అసలు పోబోకురా! మీ ఆరోగ్యం బాగుంటే జాతికి,దేశానికి,
  • మిమ్మల్ని కన్నవార్కి అంతకన్న కావలసింది
  • ఇంకేముంది గ్రహించు  మిత్రమా!
thumbnail

పొనుగుపాడులో జరిగిన వనం-మనం కార్యక్రమ విశేషాలు.

వృక్షో రక్షితి రక్షత:

“మనం చెట్టును కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది”.



అసలు మనందరం ఎంత సేపటికి మన సంతానానికి తరతరాలుగా సరిపోను ఇంకొకరికన్న మనం ఎక్కువ ఎలా సంపాదించి ఇద్దమా అనే ధ్యాస మనందరిలో ఉన్నమాట వాస్తవం. సరే కాసేపు తప్పులేదు అనుకుందాం.ఆ సంపాదింది ఇచ్చినది అనుభవించుటానికి ఆరోగ్యకరమైన వాతావరణం వారికి అందించాలనే ఆలోచన గురించి బహు కొద్ది మంది మాత్రం తప్ప ఎవ్వరూ ఆలోచించుట లేదు. ఇది ఎవరు కాదన్నా అవునన్నా వాస్తవం. మనం జీవించినదే జీవితం కాదు.మన తరువాత మన భావి తరాలవారు ఆరోగ్యంగా జీవిస్తేనే మన జన్మ సార్ధకమైనట్లు. అలాంటి మంచి ఆలోచనతో మన గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది వేణుగోపాల్ (ఎజిపి) ఆధ్వర్యంలో ది.06.08.2017 ఆదివారం నాడు “వనం-మనం” కార్యక్రమం మన గ్రామంలో నిర్వహించటం చాలా అభినందించ తగ్గ విషయం.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంద్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ కైత్ పాల్గొన్నారు.ముందుగా మేళతాళాలుతో పెద్దలు విద్యార్ధిని, విద్యార్దులు వెంటరాగా “మానవ మనుగడకు వృక్షాలే కీలకం” అనేబ్యానర్లు, ప్లేకార్డులు చేతబూని అతిధులను సాదరంగా ఆహ్వానించారు. తదనంతరం పాఠశాల ఆవరణలో పసుపు, కుంకమ, పూలుతో అందంగా అలంకరించిన పాదులలో వేదపండితుల మంత్రోచ్చారణల తో జస్టిస్ సురేష్ కుమార్ కైత్ చే మొక్కలు నాటించారు. పొనుగుపాడు నుండి గుంటూరు-కర్నూలు వెళ్లు అప్రోచ్ రోడ్డుకు ఇరువైపుల, జిల్లా పరిషత్ ఆవరణలో మరియు మెరికపూడి వెళ్లు మట్టి రోడ్డుకు రెండు వైపుల, నార్నెపాడు వెళ్లు డొంక రోడ్డులో ఇరువైపుల మొక్కలను నాటారు.గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం పండగ వాతావరణాన్ని తలపించింది.

ఈ కార్యక్రమం సందర్బంగా జిల్లా పరిషత్ ఆవరణలో జరిగిన సమావేశంలో జష్టిష్ సురేష్ కుమార్ కైత్ మాట్లాడుతూ మానవాళికి చెట్లే ప్రాణ దాతలని, సమస్త ప్రాణికోటికి వృక్షం ప్రధానమైనదని చెప్పారు. చెట్టును మనం రక్షిస్తే మనకు అది ప్రాణవాయువు ఇచ్చి మనల్ని రక్షించిదని, వాతావరణ సమతుల్యాన్ని కాపాడుతుందని, మానవ జీవితానికి అవసరమైన కలప, అనేక సుగంధ ద్రవ్యంలు అందిస్తున్నాయని చెప్పారు. జష్టిష్ సురేష్ కుమార్ ఖైత్ ఆంగ్లంలోచేసిన ప్రసంగాన్ని జిల్లా జడ్జి హరిహరనాధ శర్మ తెలుగులో అనువదించి చెప్పారు.న్యాయవాది వేణుగోపాల్ మాట్లాడుతూ నాటిన 2500 మొక్కలను గ్రామస్తుల సహకారంతో కాపాడుతామని, ప్రస్తుతం నాటిన మొక్కలు భవిష్యత్తరానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు.గ్రామాన్ని నందనవనంగా తీర్చి దిద్దుతామన్నారు.



ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి హరి హరనాధ శర్మ , రెండవ అదనపు జడ్జి సురేష్, నరసరావుపేట జిల్లా జడ్జి జయకుమార్, జాయంటు కలెక్టరు-2 యం. వెంకటేశ్వరరావు, ఆర్.డి.ఒ. బండ్ల శ్రీనివాస్, జిల్లా ఇన్ చార్జి డి.ఇ.ఒ.పిల్లి రమేష్, నరసరావుపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంటు పంగులూరి ఆంజనేయులు, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి ఉమా మహేశ్వరరావు,మాజీ అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వర్లు, డివిజనల్ సామాజిక అటవీ అధికారులు యల్.బీమయ్య, కె.మోహనరావు, తహసీలుదారు పార్ధసారధి, ఎం.పి.డి.ఒ. శ్యామలాదేవి ఇతర ఆధికారులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన స్థానికులు ముఖ్యులు సర్పంచ్ మాధవరావు, యం.పి.టి.సి.అమరయ్య, వంకాయలపాటి బలరామ కృష్ణయ్య, రాయంకుల శేషతల్పశాయి, గుంటుపల్లి జగన్నాధం, క్రోసూరి సుబ్బారావు, చంద్రమౌళి, తులసీధరరావు, రామాంజనేయులు, హెచ్.యం.పద్మావతి, తదితర గ్రామ పెద్దలు, విద్యార్ధిని విద్యార్దులు పాల్గొన్నారు.సమావేశ అనంతరం జష్టిష్ సురేష్ కుమార్ ఖైత్ ను గ్రామ పెద్దలు అధికారులు సన్మానించారు.